flipkart1

Tuesday 31 March 2015

ఐసీసీ ర్యాంకింగ్స్: 4వ స్ధానంలో కోహ్లీ, 6లో ధావన్

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు టాప్ 10లో చోటు సంపాదించారు. వన్డే క్రికెట్లో విరాట్ కోహ్లీకి 4వ స్ధానం లభించగా, శిఖర్ ధావన్‌‌ 6, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 8వ స్ధానంలో ఉన్నారు. వరల్డ్ కప్‌లో మంచి ప్రదర్శనను కనబర్చిన ఓపెనర్ రోహిత్ శర్మ ఏడు స్ధానాలు ఎగబాకి 12వ స్ధానాన్ని సంపాదించుకున్నారు. ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్ మొత్తం 330 పరుగులు చేశాడు. ఇక వరల్డ్ కప్ ఛాంపియన్స్‌గా అవతరించిన ఆస్టేలియా వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగుతుంది. ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డుని సొంతం చేసుకున్న ఆస్టేలియా బౌలర్ మిచెల స్టార్క్ కెరీర్‌లో తొలిసారి బౌలింగ్ విభాగంలో నెంబర్ వన్ స్ధానాన్ని దక్కించుకున్నాడు. ఐసీసీ టోర్నమెంట్లో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్డ్‌తో పాటు సమానంగా 22 వికెట్లు తీసుకుని అత్యధిక వికెట్లు తీసిన ఘనతను సాధించాడు.
మెల్‌బోర్న్‌లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఎనిమిది ఓవర్లకు గాను 2 వికెట్లు తీసి 20 పరుగులిచ్చిన విషయం తెలిసిందే. ఈ అద్భుత ప్రదర్శనే స్టార్క్‌కు రెండు స్ధానాలు మెరుగుపరచుకొని నెంబర్ వన్ స్ధానాన్ని కైవసం చేసుకునేలా చేసింది. వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు ముందు మిచెల్ స్టార్క్ ఏడవ స్ధానంలో ఉన్నాడు. టోర్నమెంట్ పూర్తయ్యే సరికే 147 రేటింగ్ పాయింట్స్‌తో మొదటి స్ధానంలో నిలిచాడు. ఇక భారత్ బౌలర్ల విషయానికి వస్తే ఉమేష్ యాదవ్ 16 స్ధానాలు ఎగబాకి ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ ట్రెడ్ వెల్‌తో కలిసి 18వ స్ధానంలో ఉన్నాడు.